రేపే పరిషత్ ఎన్నికలు.. సర్వం సిద్ధం !

రేపే పరిషత్ ఎన్నికలు.. సర్వం సిద్ధం !

పోలింగ్ కు కొద్ది గంటల ముందు వరకు ఉత్కంఠ రేపిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కింది. కోర్టు ఆదేశాలతో రేపు యధావిధిగా పోలింగ్ జరుగుతుంది. స్టే వచ్చినా ఎన్నికల ఏర్పాట్లు ఎక్కడా ఆపక పోవడంతో అనుకున్న సమయానికి సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో మొత్తం రెండున్నర కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 515 జడ్పిటిసి స్థానాలకు, 7220 ఎంపిటిసి స్థానాలను రేపు పోలింగ్ జరుగుతోంది. దీని కోసం 27 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా...జడ్పిటిసి,ఎంపిటిసి కలిసి 20 వేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఎన్నికల నిర్వహణ పై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కోట్టి వేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం అయ్యింది. ఎన్నికల విధుల్లో లక్ష 71 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇకపోతే 515 జడ్పిటిసిల్లో 126 ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఎంపిటిసిల్లో 2371 ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఏకగ్రీవాలు అక్రమం అంటూ ఆ పార్టీ లైన్ తీసుకుంది. మరోవైపు ఏకగ్రీవాలు, వరుస విజయాలతో వైసీపీ జోరు మీద ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం ఏకపక్షం అని చెబుతోంది. తాజా పరిస్థితుల్లో పెద్దగా కష్టపడకుండానే అధికార పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 

మరోవైపు జనసేన, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం వైదొలిగినా..తాము ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతున్నారు. వామపక్షాలు కూడా ఇదే మాట మీద ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు చెప్పింది. దీనిపై తదుపరి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. మొత్తంగా తీసుకుంటే మొదటి నుంచి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన ఎన్నికల ప్రక్రియకు రేపు ముగింపు దొరకనుంది.