అట్లీతో అల్లు అర్జున్!

అట్లీతో అల్లు అర్జున్!
'రాజారాణి' చిత్రంతో అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు అట్లీ. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. అతడు తెరకెక్కించిన 'మెర్సల్' సినిమా తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు తెలుగులో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతోన్న అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అట్లీ తన తదుపరి సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ ప్రముఖ తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తానని స్పష్టం చేశారు. అట్లీ చెప్పిన ఆ ప్రముఖ హీరో బన్నీ అని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో కూడా బన్నీ.. లింగుస్వామి అనే తమిళ దర్శకుడితో సినిమా చేయాలనుకున్నాడు. చెన్నైలో ఘనంగా సినిమా ఓపెనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. మరి అట్లీ సినిమా అయినా ఓకే అవుతుందో లేదో చూడాలి!