అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు.. తగ్గిన ఆదరణ..!

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు.. తగ్గిన ఆదరణ..!

పండగలు వచ్చాయంటే చాలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ-కామర్స్ సంస్థలు.. ముఖ్యంగా ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. అయితే.. అంచనాలు అందుకోవడంలో మాత్రం ఆ రెండు సంస్థలు వెనకబడినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. తక్కువ ధరల్లో లభించి ఉత్పత్తుల కోసం వినియోగదారులు ప్రాధాన్యత ఇవ్వడమే కారణంగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అమ్మిన యూనిట్ల సంఖ్య అంచనాలకు అనుగుణంగానే ఉన్నా.. ఆర్థిక మందగమనం ప్రభావంతో తక్కువ ధరల్లో లభించే వస్తువుల కొనుగోళ్లకే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో పండగల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్లతో స్పెషల్ సేల్స్ నిర్వహించాయి ఈ-కామర్స్ సంస్థలు.. కీలకమైన పండగల సీజన్ అమ్మకాల్లో ఈ సంవత్సరం అంచనా వేసిన స్థూల విలువలో స్వల్ప తగ్గుదల నమోదైనట్టుగా చెబుతున్నారు. ఎక్కువ సరసమైన ఉత్పత్తుల కోసం వినియోగదారుల మొగ్గుచూపడంతో.. తక్కువ ధరకు లభించే వస్తువులనే ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే యూనిట్ల పరంగా రెండు కంపెనీలు అమ్మకాలు పెరిగాయి.. ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ 5 బిలియన్ డాలర్ల (రూ. 36,000 కోట్లు) అమ్మకాలతో దూసుకెళ్లింది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేదంటున్నారు. 

ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు గత సంవత్సరంతో పోల్చితే జీఎంవీలో 30శాతం పెరుగుదలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు కంపెనీలు మొత్తం జీఎంవీ పరంగా 10-15 శాతం తక్కువ సాధించాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా, భారతదేశం యొక్క నాన్-మెట్రోపాలిటన్ ప్రాంతాల నుండి వచ్చిన వినియోగదారులు ఈ సీజన్ అమ్మకాలలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నారు. ఫ్యాషన్, హోమ్ మరియు ఎలక్ట్రానిక్స్ యూనిట్లలో తక్కువ-ధర వస్తువుల కొనుగోళ్లకే మొగ్గుచూపినట్టుగా చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల విలువ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల లక్ష్యాలను కోల్పోయినప్పటికీ, పెద్ద ఉపకరణాలు, ఫ్యాషన్, గృహోపకరణాల వంటి విభాగాలలో ఇది బాగా పనిచేసినట్టుగా వెల్లడించారు. మరోవైపు, అమెజాన్ ఇండియా సాధారణ వస్తువులు, జీవనశైలిపై అంచనాలను కోల్పోయింది. మొబైల్ అమ్మకాలు పెరిగినట్టుగా చెబుతున్నారు.