భూగోళంపై అత్యంత విలువైన కంపెనీ అమెజాన్

భూగోళంపై అత్యంత విలువైన కంపెనీ అమెజాన్

ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భూగోళంపై అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా మారి ఏడాదికి పైగా గడిచింది. ఇప్పుడు ఆయన సారథ్యంలో అమెజాన్ మరో ఘనతను సాధించింది. అమెజాన్  ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. సోమవారం మైక్రోసాఫ్ట్ ని వెనక్కి నెట్టిన అమెజాన్ అగ్రస్థానాన్ని అలంకరించింది. మంగళవారం గ్లోబల్ మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ స్టాక్ మరో 1% పెరగడంతో ప్రస్తుతం కంపెనీ విలువ 810 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57 లక్షల కోట్లు)కు చేరింది. మైక్రోసాఫ్ట్ విలువ సుమారు 790 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ ఏడాది ఇప్పటికే అమెజాన్ 10% పెరిగింది. 135 బిలియన్ డాలర్ల విలువైన బెజోస్ 16% వాటాతో ఇది పెరుగుతున్నట్టు ఫోర్బ్స్, బ్లూమ్ బర్గ్ సంస్థలు చెబుతున్నాయి. రోదసీ పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజిన్, ది వాషింగ్టన్ పోస్ట్ లకు కూడా బెజోస్ యజమాని. ప్రపంచంలో రెండో అత్యంత ధనికుడైన మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే బెజోస్ 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధనవంతుడిగా ఉన్నాడు. ప్రపంచంలో అత్యంత విలువైన ర్యాంకింగుల్లో అగ్రస్థానం సాధించిందంటే అమెజాన్ తన అత్యధిక ధర ట్రేడవుతున్నట్టు కాదు. గత సెప్టెంబర్ లోనే కంపెనీ ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకుంది. కొన్ని నెలలుగా అమెజాన్, ఇతర టెక్ స్టాక్స్ తమ అత్యున్నత స్థాయిల నుంచి కిందికి జారాయి. రికార్డ్ హైకి సుమారు 20% తక్కువగా అమెజాన్ షేర్లు ట్రేడవుతున్నాయి. 

మరోవైపు  చైనా దెబ్బకి యాపిల్‌ షేర్ మరింత పడిపోయింది. ఒకపుడు1.1 ట్రిలియన్ డాలర్లు అధిగమించిన యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌, ప్రస్తుతం తన గరిష్ట స్థాయి నుంచి 35%కి పైగా జారింది.  యాపిల్‌ ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ 710 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 750 బిలియన్ డాలర్లతో  గూగుల్ (మాతృసంస్థ ఆల్ఫాబెట్) మూడో స్థానంలో ఉంది. 

జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ రిటైల్ రంగంలో, ఆన్ లైన్ సేవలతో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి దూసుకుపోతోంది. 2013లో అమెజాన్ రెవెన్యూ 74.5 బిలియన్ డాలర్లు కాగా, 2018 చివరి నాటికి కంపెనీ ఆదాయం 177.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అది 232.2 బిలియన్ డాలర్లకు చేరవచ్చని విశ్లేషకుల అంచనా.