కొబ్బరిచిప్ప రూ.1,200!! అమెజాన్ లో అమ్మకం

కొబ్బరిచిప్ప రూ.1,200!! అమెజాన్ లో అమ్మకం

అవును. మీరు చదివింది నిజమే. కొబ్బరిచిప్ప ఖరీదు రూ.1,200. ఈ సారి ఎప్పుడైనా మీరు కొబ్బరిచిప్పలు పారేసేటపుడు ఒకసారి ఆలోచించండి. జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే ఇంటర్నెట్ లో కొబ్బరిచిప్పలు వేలకు వేలు సంపాదించి పెడుతున్నాయి. ఓ కొబ్బరిచిప్పకి ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో రూ.1,300కి పైగా ధర ఉందని తెలిసిన తర్వాత భారతీయులైతే షాకైపోతున్నారు. కొబ్బరిచిప్ప బొమ్మ పక్కన ‘ఇది అచ్చమైన నిజమైన కొబ్బరిచిప్ప. అందువల్ల దీనిపై పగుళ్లు, సొట్టలు, అపసవ్యాలు ఉండవచ్చు’ అని వర్ణన కూడా ఉంది. 

దీనికి ఘనంగా బ్రాండ్ పేరు కూడా పెట్టారు. ‘నేచురల్ కోకోనట్ షెల్ కప్స్’ అనే పేరుతో ఈ కొబ్బరిచిప్పలను రూ.1,289 ఆరంభ ధర నుంచి రూ.2,499 వరకు అమ్ముతున్నారు.  చెప్పాలంటే అసలు ధర రూ.3,000. డిస్కౌంట్ల తర్వాత అమ్ముతున్న వెల ఇది. ఈ కొబ్బరిచిప్ప కామెడీని చూసిన ఒకరు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ కొబ్బరిచిప్పల వ్యవహారం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

నమ్మశక్యంగా లేనప్పటికీ ఈ వార్తతో చాలా మంది భారతీయులు అవాక్కయ్యారు. రూ.20 అంత కంటే తక్కువకు కొబ్బరికాయలు కొనుక్కొని వాడిన తర్వాత చిప్పలు పారేయడానికి అలవాటు పడ్డవారంతా తమ అపనమ్మకాన్ని ట్విట్టర్ లో వెలిబుచ్చారు.