ఉద్యోగుల కనీస వేతనం పెంచిన అమెజాన్

ఉద్యోగుల కనీస వేతనం పెంచిన అమెజాన్

అమెజాన్‌ అమెరికాలో ఉద్యోగుల కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో వచ్చే నెల నుంచి అమెజాన్‌ ఉద్యోగులకు రోజుకు దాదాపు ఎనిమిది వేల రూపాయలు పొందనున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కంపెనీలో పని పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో అమెజాన్‌ కనీస వేతన పెంపును ప్రకటించింది. కనీస వేతనాన్ని పెంచే దిశగా అమెరికన్‌ ప్రభుత్వంపై లాబీయింగ్‌ చేయడంతో పాటు తమ ప్రత్యర్ధులను సైతం ఈ దిశగా ముందడుగు వేయాలని కోరతామని ప్రకటనలో పేర్కొంది. కొత్త కనీస వేతనంతో 2.5 లక్షల మంది అమెజాన్‌ ఉద్యోగులతో పాటు హాలిడే సేల్స్‌ కోసం తాత్కాలికంగా రిక్రూట్‌ చేసుకున్న లక్షకు పైగా సీజనల్‌ ఉద్యోగులకు లబ్ధి కలగనుందని కంపెనీ తెలిపింది. కనీస వేతన పెంపు దిశగా తొలి అడుగు వేయాలనే చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్‌ వ్యవస్ధాపక సీఈఓ జెఫ్‌ బెజోస్‌ తెలిపారు.