మేం కుట్రదారులం కాదు.. కోడెలే ఫ్యాక్షనిస్టు 

 మేం కుట్రదారులం కాదు.. కోడెలే ఫ్యాక్షనిస్టు 

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో పోలింగ్‌ రోజు జరిగిన ఘటనపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ తప్పుడు అభియోగాలు మోపారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల పోలింగ్ బూత్ కెళ్లి తలుపులేసుకోవడంతో ప్రజలు తిరగబడ్డారని అన్నారు. సత్తెనపల్లికి కోడెల ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకువచ్చారని మండిపడ్డారు. కోడెల బహిరంగ క్షమాపణ చెప్పకపోవతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాపై ఎప్పుడు ఎన్నికల నేరాలు లేవని అన్నారు. కోడెల ఇంట్లోనే బాంబులు పేలిన ఘటనను అంబటి గుర్తుచేశారు. నాపై నమోదైన కేసు నుంచి పారిపోయే ప్రసక్తి లేదని అన్నారు. మేం కుట్రదారులం కాదు... కోడెలే ఫ్యాక్షనిస్టు అని ఆరోపించారు. ఇనుమట్ల ప్రజానికాన్ని వేధిస్తే సహించే ప్రసక్తేలేదని తెలిపారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే కోర్టు బోనులో నిలబెడతామని అంబటి రాంబాబు హెచ్చరించారు.

స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో 35 మందిపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి తెలిపారు. అలాగే కోడెలపై దాడికి ప్రోత్సహించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, రాజనారాయణ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. 8 మందిని అదుపులోకి తీసుకోగా.. మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి రాజుపాలెంలో ఉండి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.