చంద్రబాబు, లోకేష్ ను అరెస్ట్ చేసి విచారించాలి !

 చంద్రబాబు, లోకేష్ ను అరెస్ట్ చేసి విచారించాలి !

అధికారంలో ఉన్నప్పుడు ఐటీ దాడులు జరిగితే  కేంద్రం కుట్ర అని మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐదు రోజుల పాటు అత్యంత సన్నిహితులపై ఐటీ దాడులు జరిగినా.. చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చాలా అక్రమాలు చేశారని మొదట్నుంచీ చెబుతున్నామన్నారు అంబటి రాంబాబు. ఐటి రైడ్స్ లో టిడిపి బాగోతం బయట పడిందని, చంద్రబాబు సన్నిహితుల పై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగినా చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరించారని అన్నారు. చంద్రబాబు పి ఎస్ పై దాడి చేస్తే అనేక విషయాలు బయటపడ్డాయన్న అంబటి మనీ లాండరింగ్ కి సంబందించి ఐటి ఆధారాలు సేకరించిందని అన్నారు. 2000 కోట్ల రూపాయలు చేతులు మారాయని రుజువు అయ్యిందని, లోకేష్ కూడా వీటి పై స్పందించలేదని అన్నారు. 

చంద్రబాబు అవినీతిపరుడు అని స్వయంగా ఎన్టీఆర్ చెప్పారని, చంద్రబాబు వలనే రాష్ట్రంలో  ఎన్నికల ఖర్చులు పెరిగిపోయాయని అన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన స్విస్ బ్యాంక్ లో డబ్బు లెక్కలు చూసుకోవడం కోసమే నని అన్నారు. చంద్రబాబు పాపం పండిందని 2000 కోట్లు దొరికాయి అంటే అది పీఎస్ ఒక్కడి పనే కాదని అన్నారు. చంద్రబాబు కుమారుడిని విచారిస్తే లక్షల కోట్లు బయటపడతాయని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి బ్రతుకుతున్నారన్న అంబటి  అనేక స్టేలు తెచ్చుకుని హైదరాబాద్ లో కూర్చుని ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలా అని కుట్ర పన్నుతున్నారని అన్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ ను అరెస్ట్ చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతమంది వచ్చిన ఇంక చంద్రబాబును కాపాడలేరని, నీతి నిజాయితీ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పీఎస్ కు పార్టీ కి సంబంధం లేకపోవచ్చు కానీ డబ్బుతో సంబంధం ఉందని అన్నారు. బాబు పీఎస్ దగ్గర అంత దొరికితే ఆయన పైన ఉన్న బాబు దగ్గర ఎంత దొరుకుతుందని ప్రశ్నించారు.