అంతిమ యాత్రలా లేదు...ప్రచార యాత్రలా ఉంది 

అంతిమ యాత్రలా లేదు...ప్రచార యాత్రలా ఉంది 

పార్టీలో ఎన్నో ఏళ్లుగా సహచరుడిగా ఉన్న వ్యక్తి చనిపోతే.. చంద్రబాబులో ఆ భావోద్వేగమే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అంతిమయాత్రలో బాబు పద్ధతి చూస్తే.. అది తుది వీడ్కోలు చెబుతున్నట్టు లేదని, ఎన్నికల ప్రచార యాత్రలా ఉందని సెటైర్లు వేశారు. కోడెల గతంలో కూడా ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేశారని, అప్పుడైనా చంద్రబాబు ఆయనకు మద్దతుగా మాట్లాడి ఉంటే కచ్చితంగా బతికి ఉండేవారన్నారు అంబటి రాంబాబు.

అప్పుడు ఏమీ మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడెందుకు గొంతు చించుకుంటున్నారని ప్రశ్నించారాయన. కోడెల బతికి ఉన్నప్పుడు చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సమ్మతమేనని బాబు అన్నారని గుర్తుచేశారు. లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం ఇంత రాద్ధాంతమేంటన్న చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవం కాదని అంబటి రాంబాబు అన్నారు. ఫర్నిచర్ విలువ కొన్ని కోట్ల రూపాయలని అది దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కొన్న ఫర్నిచర్ అని గుర్తు చేశారు అంబటి.

పైగా ఫర్నిచర్ కోడెల ఆఫీస్ లో లేదని, ఆయన కొడుకు షోరూమ్ లో ఉందని చెప్పారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాలు వచ్చిన తరుణంలో.. పేపర్ లీకైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. పేపర్ లీకైతే.. పరీక్ష జరిగిన రోజు ఎందుకు వార్తలు రాయలేదని నిలదీశారాయన. ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అంబటి ఆరోపించారు.