హెచ్‌సీఏలో అవినీతి..! అంబటి రాయుడు ఫైర్, ఫిర్యాదు..

హెచ్‌సీఏలో అవినీతి..! అంబటి రాయుడు ఫైర్, ఫిర్యాదు..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు క్రికెటర్ అంబటి రాయుడు.. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాయుడు.. అవినీతి ఊబిలో కూరుకుపోయిన హెచ్‌సీఏపై దృష్టి సారించాలంటూ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీఏలో అవినీతి వ్యవహారంపై ట్విట్టర్‌లో స్పందించిన అంబటి రాయుడు.. "హలో కేటీఆర్ సర్, హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతిని ఓసారి పరిశీలించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. పలు ఏసీబీ కేసులు ఉన్న వ్యక్తులకు తోడు డబ్బున్న వ్యక్తుల ప్రాబల్యం వల్ల హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది..? అవినీతిపరులకు హెచ్‌సీఏలో రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు..!'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, క్రికెట్ వరల్డ్ కప్ 2019లో తనకు చోటు దక్కకపోవడం.. అతని స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంతో.. '3డీ గ్లాసెస్' ట్వీట్ చేసి కాకరేపిన అంబటి రాయుడు.. ఆ తర్వాత చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం విశేషం. మరోవైపు 2019 ప్రపంచ కప్‌ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. మళ్లీ ఆగస్టులో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.