హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం : అంబటి

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం : అంబటి

ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు  స్పష్టం చేశారు. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు పేర్కొన్న ఆయన న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాల కోసమే పై కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు అంబటి. ఇక నిజానికి మార్చిలో హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లలో మార్పులు చేసి స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు నిమ్మగడ్డ రమేష్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. అయితే కరోనా తీవ్రత పెరగడమే కాక గతం కంటే ఎక్కువగా ఏకాగ్రీవాలు కావడం. కొన్ని చోట్ల నామినేషన్ పేపర్లను అధికార పార్టీ వారు లాక్కుని పారిపోయారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు లేవనెత్తిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడే ఆయన నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. 

హుటాహుటిన ముఖ్యమంత్రి జగన్... గవర్నర్‌ను కలిసి ఈ విషయంపై చర్చలు కూడా జరిపారు. ఎన్నికల వాయిదాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 10న నిమ్మగడ్డ రమేష్‌ను తొలగిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. జీవో నెంబర్ 618ని జారీ చేసింది. ఆయన స్థానంలో కనగరాజును నియమించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఏప్రిల్ 12న హైకోర్టులో టిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ రమేష్. దీనిపై ఏప్రిల్ 18న ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వైద్య ఆరోగ్య శాఖతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండా నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. నిమ్మగడ్డ తొలగింపుపై మొత్తం 13 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారించిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్‌ను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేసింది. ఆయన్ను తిరిగి SECగా నియమించాలని ఆదేశించింది. దీని మీదే ఇప్పుడు అంబటి పై కోర్టుకు వెళతామని అంటున్నారు.