కంపు కొట్టే సిటీని ఇంపుగా మార్చింది

కంపు కొట్టే సిటీని ఇంపుగా మార్చింది

ఒక కలెక్టర్ గా ఏం చేయవచ్చో, కంపుకొట్టే సిటీని ఏ స్థాయిలో రూపురేఖలు మార్చవచ్చో రీతూసేన్ ఐఏఎస్ పూర్తి చేసిన పనులే చెబుతాయి. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాకు 2014 ఫిబ్రవరిలో కలెక్టర్ గా వచ్చారు రీతూ సేన్. ఆమె తొలిసారిగా జిల్లా పర్యటన చేసినప్పుడు అంబికాపూర్ సిటీని చూశారు. సిటీలోకి ఎంటర్ అవుతూనే వెల్ కమ్ బోర్డు స్వాగతం పలుకుతుంది. ఆ బోర్డును ఆనుకునే 16 ఎకరాల్లో ఉన్న భారీ డంపింగ్ యార్డు ఆమెను తొలిచూపులోనే ఆకర్షించింది. ఎందుకంటే స్వాగత ద్వారం దగ్గరే దుర్గంధం వ్యాపింపజేసే డంపింగ్ యార్డు కనిపించింది మరి. అప్పుడే ఆమె నిర్ణయించుకుంది అంబికాపూర్ కు ఏమైనా చేయాలని. 

లక్షా 45 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ పద్ధతిలో ఓ మోడల్ ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఒక వార్డులో పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి సక్సెస్ అవడంతో మొత్తం 48 వార్డులకూ విస్తరించారు. తడి చెత్త, పొడిచెత్తను వేరుచేయడం, దాన్ని రీసైకిల్ చేయడం, దాన్నుంచి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడం, స్థానిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం.. ఇవే ఆమె లక్ష్యాలు. ఇందుకోసం పట్టణ ప్రజలతో అనేకసార్లు సమావేశమైంది. వారిని ఒప్పించి ముగ్గురితో ఒక టీమ్ ను తయారు చేసింది. ఆ ముగ్గురిలో ఒకరు సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మెంబర్. ప్రతి టీము వంద ఇళ్లకు ప్రతిరోజూ వెళ్లాలి. ఆ ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలి. తొలి దశలో అక్కడే తడి-పొడిగా వేరు చేస్తారు. దాన్ని గార్బేజ్ క్లినిక్ కి తీసుకొచ్చి ఆర్గానిక్, ఇనార్గానిక్ పద్ధతిలో మరోసారి వేరు చేస్తారు. దాన్ని స్క్రాప్ డీలర్లకు అమ్మాక మరోసారి మైక్రో లెవల్లో సెగ్రిగేషన్ అయిపోతుంది. ఇలా 2016 వచ్చేనాటికి ప్రతి వార్డుకు ఒక గార్బేజ్ సెగ్రిగేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి 447 మంది మహిళా వర్కర్లకు పని కల్పిస్తోంది. వారికి నెలకు రూ. 5 వేల వేతనం వస్తోంది. అటు చెత్త సేకరిస్తున్నందుకు ప్రతి ఇల్లూ యూజర్ చార్జీలు చెల్లించడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. స్వాగత ద్వారం దగ్గర దుర్గంధం వెదజల్లిన చోటనే శానిటేషన్ పార్కును నిర్మించింది రీతూ సేన్.

ఫలితంగా దుర్గంధం కొట్టే అంబికాపూర్ ను ఈ ఏడాది క్లీనెస్ట్ స్మాల్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.