దీదీ అడ్డుపడినా ఊరుకోం..! ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తాం..

దీదీ అడ్డుపడినా ఊరుకోం..! ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తాం..

కేంద్ర హోంమంత్రి హోదాలో కోల్‌కతాలో పర్యటించి అమిత్‌షా రాజకీయ కాకరేపారు. దసరా సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన భారీ సభలో... చాలా ఆవేశపూరిత ప్రసంగం చేశారాయన. ముఖ్యంగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్న ఎన్‌ఆర్సీ, చొరబాటుదారుల అడ్డగింత విషయంలో చాలా స్పష్టమైన ప్రకటన చేశారు అమిత్ షా. ఒకనాడు చొరబాటుదారులకు వ్యతిరేకంగా మమతా దీదీ తీవ్రమైన పోరాటం చేశారని, లోక్‌సభలో సైతం శాలువాను స్పీకర్‌పైకి విసిరికొట్టారని ఆయన గుర్తు చేశారు. సీఎం కాగానే చొరబాటుదారులు ఓటు బ్యాంకుగా మారడంతో స్వరం మార్చేశారని విమర్శించారాయన. ఎవరెన్ని విమర్శలు చేసినా.. అడ్డంకులు సృష్టించినా జాతీయ పౌరసత్వ చట్టం విషయంలో రాజీపడబోమని, ఒక్క చొరబాటుదారుడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి. 

మూడు వందలకుపైగా ఎంపీ సీట్లతో మోడీ రెండోసారి అధికారం చేపట్టడంలో పశ్చిమ బెంగాల్‌ కీలక పాత్ర పోషించందన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా. 18 ఎంపీ సీట్లు గెలిపించి మార్పు కోరుకుంటున్నామన్న విషయాన్ని ప్రజలు కుండబద్దలు కొట్టారన్నారు. బెంగాల్‌కు బీజేపీ బయటపార్టీ కాదన్న అమిత్‌ షా.. జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తుచేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఎత్తేయడం కోసం బలిదానం చేశారని పేర్కొన్నారు. శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఆశించిన దానిని ప్రధాని మోడీ పూర్తి చేశారన్నారు అమిత్ షా.