భారత్‌ బంద్‌ సెగ..! రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్‌షా

భారత్‌ బంద్‌ సెగ..! రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్‌షా

కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలంటూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు రైతులు.. ఇప్పటి వరకు దేశరాజధానికే పరిమితమైన ఈ ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా.. ఇవాళ భారత్‌ బంద్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది.. దీంతో.. షెడ్యూల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల ప్రతినిధులతో ఈనెల 9వ తేదీన చర్చలు జరపాల్సి ఉన్నా.. రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఇవాళే రైతులను చర్చలకు ఆహ్వానించారు.. రైతు సంఘాల ప్రతినిధులతో ఇవాళ రాత్రి 7 గంటలకు భేటీ కానున్నారు అమిత్‌షా. 

ఇప్పటికే రైతులతో ఐదు సార్లు కేంద్రం చర్చలు జరిపింది.. అయినా.. ఎలాంటి ముందడుగు పడలేదు.. ప్రతీసారి చర్చలు అర్థాంతరంగానే ముగిశాయి.. ఇక, ఆ సమావేశాలకు వెళ్తున్న రైతు సంఘాల నేతలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసే భోజనాలను కూడా స్వీకరించడం లేదు.. వాళ్ల ఫుడ్‌ను వాళ్లే బయటి నుంచి తెప్పించుకుని తింటున్నారు. ఓవైపు తమ ఉద్యమంపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగిస్తున్నారు.. మొత్తంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తం అవుతున్న సమయంలో.. ఎలాగైనా రైతుల సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోన్న సర్కార్.. 9వ తేదీన ఆరో రౌండ్‌ చర్చలకు సిద్ధం కాగా.. ఇవాళ రాత్రికే చర్చలకు పిలిచారు అమిత్‌షా.. భారత్ బంద్‌లో భాగంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు రావాణా మరియు రైలు ప్రయాణాలను తాకింది. అనేక రహదారులను దిగ్బంధం చేశారు.. మార్కెట్లను మూసివేశారు.. అన్నిరకాల వస్తు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో.. షా ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. నాకు ఫోన్ వచ్చింది.. అమిత్ షా ఒక సమావేశాన్ని పిలిచారు.. మమ్మల్ని రాత్రి 7 గంటలకు సమావేశానికి రావాలని పిలిచారని తెలిపారు రైతుల నాయకుడు రాకేష్‌ టికైట్.. ఢిల్లీ సమీపంలోని రహదారులపై నిరసన తెలిపే వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ సమావేశానికి హాజరవుతామని వెల్లడించారు. కాగా, నేటి భారత్‌ బంద్‌కు కాంగ్రెస్, ఎన్‌సిపి, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకె, టిఆర్‌ఎస్, వాపక్షాలు సహా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.