ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు అమిత్‌ షాయే!!

ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు అమిత్‌ షాయే!!

సంస్థాగత ఎన్నికల వరకు హోమ్ మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఆర్నెల్లలోగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. బీజేపీ సమావేశం వివరాలు చెబుతూ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ పార్టీ ఇంకా అత్యున్నత శిఖరాలకు చేరుకోలేదని అమిత్ షా చెప్పినట్టు తెలిపారు. ఇప్పుడు ఇంకా చేరని ప్రాంతాలకు కూడా పార్టీ చేరాల్సి ఉందని షా అన్నట్టు చెప్పారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అమిత్ షా నేతృత్వంలోనే పోటీ చేస్తుందని యాదవ్ స్పష్టం చేశారు. 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించింది. సొంతంగా 300 సీట్ల మైలురాయిని దాటింది. ఈ ఘనత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు, ప్రణాళికలదేనని పార్టీ చెప్పింది. అమిత్ షా మోడీ కేబినెట్ లో చేరిన తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. హోమ్ శాఖ మంత్రి అయిన తర్వాత షాకు రెండు బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారినట్టు చెబుతున్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసింది. కానీ పార్టీ ఎన్నికలయ్యే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది. బీజేపీ నియమ నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుడు మరో మూడేళ్లు తన పదవిలో కొనసాగవచ్చు. సంస్థాగత ఎన్నికలయ్యే వరకు షా తన పదవిలో కొనసాగుతారా లేదా అనేది రేపు జరగబోయే సమావేశంలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాల సమాచారం.