బెంగాల్‌లో టెన్షన్‌ టెన్షన్.. పర్యటనకు సిద్ధమైన అమిత్‌షా...!

బెంగాల్‌లో టెన్షన్‌ టెన్షన్.. పర్యటనకు సిద్ధమైన అమిత్‌షా...!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనతో కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాల మధ్య మాటలయుద్ధం మరింత తీవ్రమైంది. నిప్పుతో చెలగాటమొద్దంటూ గవర్నర్‌ హెచ్చరించడంపై.. సీఎం మమత ఫైరయ్యారు. సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీచేయడం రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు దీదీ. దాడి ఘటనలో ఎలాంటి భద్రతాలోపాలు లేవని తేల్చేశారు. పదేళ్లపాటు అభివృద్ధి దిశగా సాగుతున్న బెంగాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మమత. తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి చేయడం ద్వారా, ఢిల్లీలోని బంగాభవన్‌లో హింసను ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్రాల సంప్రదాయాలు, వారి అభిప్రాయాలకు విలువివ్వకుండా ముందుకు సాగుతోందన్నారు.

బీజేపీ నాయకత్వాన్ని నియంతలైన హిట్లర్‌, ముస్సోలినిలతో పోల్చారు మమత. తప్పుడు ప్రచారంతో రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న మమతత.. 400 ఎంపీల మద్దతు ఉన్న రాజీవ్‌ గాంధీ కూడా ఇలాంటి సాహసం చేయలేదని.. మోడీ మాత్రం తమకు తోచిన చట్టాలను ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. కొత్తగా పార్లమెంటు భవనాన్ని నిర్మించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆ డబ్బులు దేశంలోని రైతులకు ఇవ్వాలన్నారు. మరోవైపు.. ఈనెల 19, 20 తేదీల్లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా.. బెంగాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎన్నికల సన్నద్దతను సమీక్షించనున్నారు. నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిన సమయంలో, అమిత్‌షా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.