అమితాబ్‌-జయ.. అగ్ని పర్వతం బద్ధలైన వేళ..

అమితాబ్‌-జయ.. అగ్ని పర్వతం బద్ధలైన వేళ..

అది 1992
అమితాబ్‌ 50వ పుట్టిన రోజు. ఆయన మొదటి ఇల్లు ప్రతీక్షలో...
సోఫాలో సూపర్‌స్టార్‌. పక్కన ఆయన భార్య జయాబచ్చన్‌. వారి పక్కనే వారి పిల్లలు అభిషేక్‌ బచ్చన్‌. శ్వేతా. హిందుస్థాన్‌ టైమ్స్‌ ప్రతిక వారి ఐ విట్నెస్‌ ప్రోగ్రామ్‌ కోసం ఇంటర్వ్యూ ప్రారంభించారు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌. అపుడు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే క్లుప్తంగా...


'మొదటి టేప్‌ పూర్తయింది. ఇంటర్వ్యూ బాగానే సాగుతోంది. టీవీ సిబ్బంది మరో టేప్‌ మార్చకుంటున్నారు. ఈలోగా అమితాబ్‌ నాతో మాట్లాడుతూ, తను ఇటీవలే అమెరికా టెలివిజన్‌లోవార్‌ బెట్టి ఇంటర్వ్యూ చూసినట్లు చెప్పారు. అలాగే అందులో మరో మహిళతో బ్రెట్టికి ఉన్న సంబంధం గురించి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ ఎంత సూటిగా,  నిర్భయంగా అడిగాడో చెప్పారు. అప్పటికే అమితాబ్‌కు ఇతర హీరోయిన్లతో ఉన్న సంబంధాల గురించి మీడియాలో వస్తున్న వార్తలు చాలా వచ్చాయి. ఇలా ఇంటర్వ్యూలో మధ్యలో హాలీవుడ్‌ హీరో, అతని అక్రమ సంబంధాల గురించి అమితాబ్‌ ప్రస్తావించడం నాకు ఆశ్చర్యమనిపించింది. అందరిలాగే నేను మీడియాలో అమితాబ్‌ అఫైర్స్‌ గురించి నేనూ చదివాను. లోతుగా వివరాలైతే నాకూ తెలియదు. పూర్తి వివరాలు తెలియకుండా ప్రశ్నలు వేయడం సబబా అని నాకు అనిపించింది. మరి ఇంటర్వ్యూ మధ్యలో బ్రెట్టి ప్రస్తావన తేవడం దేనికి? నన్ను కూడా అడగమంటున్నాడా అని అనిపించింది. అయిదు నిమిషాలైంది. ఈలోగా టేప్‌ ఛేంజ్‌  చేశారు. ఈలోగా నేను  ఓ నిర్ణయానికి వచ్చేశాను. టెంప్టేషన్‌ అలాంటిది మరి. బ్రెట్టిని అమెరికా టీవీ జర్నలిస్ట్‌ ఎలా అడిగాడో అలాగే ప్రశ్నిద్దామని రెడీ అయిపోయాను.

టేప్‌ ఆన్‌ అవగానే...
టేప్‌ ఛేంజ్‌ చేసుకునే మధ్యలో మీరు వారెట్‌ బ్రెట్టి గురించి నాకు చెప్పారు. అంటూ అమితాబ్‌ ఏం చెప్పారో వివరించాక... బ్రెట్టిని ఆ టీవీ జర్నలిస్టు అడిగినట్లే నేను అడుగుతున్నాను. హీరోయిన్లతో మీకు అఫైర్స్‌ ఉన్నాయని మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. మీ పెళ్ళయ్యాక...మరో మహిళతో మీకు అఫైర్స్‌ ఉన్నాయా అని అడిగాను. అమితాబ్‌ స్టన్నయ్యాడు. కాని ముఖంలో ఆ ఫీలింగ్‌ లేదు. అతని కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాను. ఆయన నన్ను అలాగే చూస్తున్నాడు. ముఖ్యంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆయన ముఖ కవళికలు ఇపుడు నాకు గుర్తుకు రావడం లేదు. "లేదు. లేనే లేద"ని  అమితాబ్‌ సమాధానం."మీకు పర్వీన్‌ బాబీతో సంబంధాలు ఉన్నాయని వారు అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదంటారా?" మళ్ళీ నేను అడిగా..."లేదు" అమితాబ్‌ వదిలిచ్చారు. "నేను కూడా అలాంటి కథనాలు చదివాను. అవి నిజం కాదు. ఇలాంటివి రాయకుండా నేను మేగజైన్లను ఆపలేను కదా" అంటూ సమాధానం పొడిగించారు.


"రేఖ గురించి ఏమంటారు"..
ఈ ప్రశ్న వేసిన వెంటనే  అమితాబ్‌ కళ్ళలో చిన్న కదలిక గమనించాను. సమాధానం ఇవ్వడానికి కాస్త సమయం తీసుకున్నారు. కాని బదులు ఇచ్చినపుడు ధృడ స్వరంగా అన్నారు. "లేదు. ఆమెతో కూడా లేదు" అంతే మరో ముక్క మాట్లాడలేదు. అంతే అంతటితో ఆపేశారు. ఈలోగా నేను జయబచ్చన్‌ వైపు చూశాను. మీ ఆయనను మీరు నమ్ముతారా అని ప్రశ్నించా. ఆమె ఒక్కసారి కంగుతింది. వెంటనే అమితాబ్‌ తన చూపును జయబాధురి వైపు మళ్ళించారు. ఆమె కళ్ళలోకి చూశారు. ఆమె సమాధానం కూడా ఎదురు చూస్తున్నాం ఇద్దరం. "నా భర్తపై నాకెపుడూ విశ్వాసముంద"ని జయబాధురి బదులిచ్చారు. "మీరు నిజంగానే అంటున్నారా లేదా మీ ఆయన పక్కన ఉన్నారని అంటున్నారా" అని మళ్ళీ ప్రశ్నించాను. జయ నవ్వింది. సమాధానం ఇచ్చే ముందు ఆమె అమితాబ్‌వైపు చూశాను.. "అఫ్‌ కోర్స్‌ ఐ ఈన్‌ ఇట్‌... వై షుడ్‌ ఐ నాట్‌ " అంటూ బదిలిచ్చారు. ఇక టాపిక్‌పై ఇంకా ఎక్కువ మాట్లాడ కూడదనుకున్నా.


ఎక్కడా ఇబ్బంది పడలేదు..
ఇంతకుమునుపే రాసున్న ప్రశ్నతలతో మిగిలిన ఇంటర్వ్యూ పూర్తి చేశా. అది మరో అరగంట సాగింది. మధ్యలో తన లవ్‌ అఫైర్‌ గురించి మాట్లాడినందుకు ఆయన ఎక్కడా ఇబ్బంది పడినట్లు నాకు అనిపించలేదు. లంచ్‌ కోసం ఉండమని, నన్ను... సిబ్బందిని అమితాబ్‌  పట్టుబడటంతో... అమితాబ్‌ ఇబ్బంది పడలేదని నాకు మరింత ధృవపడింది. అమితాబ్‌ అప్‌సెట్‌ కాలేదనిపించింది. 'ఆ' ప్రశ్నలు నేను వేయాలని.. తన సమాధానం చెప్పాలని అమితాబ్‌  భావిస్తున్నారని నాకు అనిపించింది. కాని నా అభిప్రాయం తప్పనిపించింది. అది ఒక అగ్ని పర్వతమని తరవాత జరగిన ఘటనలతో తెలిపింది. లోపల అగ్ని గుండం పేలడానికి సిద్ధంగా ఉంది..వెంటనే పక్క రూమ్‌లో భోజనానికి కూర్చున్నపుడు ఆ అగ్ని పర్వతం బద్ధలైంది. కొంత అన్నం వొడ్డించనా అని జయ ప్రశ్నించడంతో ఆ అగ్ని పర్వతం బద్ధలైంది. "నేను అన్నం తినని నీకు తెలుసుగా" వెంటనే బదులిచ్చారు అమితాబ్‌. "నేను ఎపుడూ తినని దాన్ని ఇపుడెందుకు వడ్డిస్తానని అంటావ్‌" అన్నారు. నిజంగా అగ్ని పర్వతం బద్దలైనట్లే ఉంది ఆ కోపం. ఆయనలోని కోపం ఇపుడు ఆయన ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది.

వెంటనే గదిలో వాతావరణం మారిపోయింది. టీవీ సిబ్బంది.. వారి పిల్లలు కూడా ఒక్కసారిగా స్టన్నయ్యారు. తెలియని భయం వారిలో. "రోటీలు ఇంకా రాలేదు. అందుకే ఈలోగా అన్నం వడ్డించనా అన్నా" అని జయ చాలా సౌమ్యంగానే అన్నారు. "నాకు అన్నం వొద్దు" ఈసారి దాదాపు అరిచేలా  అన్నారు అమితాబ్‌. "నేను ఎపుడూ అన్నం తినను. నీకా విషయం తెలుసు. రోటీలు ఇంకా రాలేదని నేను అన్లేదే. అన్నం పెట్టనా అని మాత్రం అనొద్ద"ని అమితాబ్‌ అన్నారు. నా ప్రశ్నలకు సమాధానం ఇదని ఆలస్యంగా నాకు అర్థమైంది. అదర్థమయ్యాక నాకు చాలా  ఇబ్బందిగా అనిపించింది. ఆయన పక్కన, ఆయన తిండి తినడం మరీ ఇబ్బంది అనిపించింది. హమ్మయ్య ఎట్లాగో మొత్తానికి భోజనం కానిచ్చేస్తున్నాం. "రోటీలకు ఏమైంది ఇపుడే కనుక్కొని వస్తా"నంటూ ఈ సారీ జయ సౌమ్యంగానే అన్నారు. హమ్మయ్య.. అమితాబ్‌ను ఆమె చల్లబరుస్తోందని అనుకున్నా. వెంటనే ఆమె "ఈలోగా కొంచెం అన్నం ఎందుకు తినరు?" అంటూ ప్రశ్నించారు. "ఆపు.. ఇక ఆపేయ్‌ అంతే" అన్నారు అమితాబ్‌. "అన్నం వొద్దన్నాను.. వొద్దు. రోటీలు వచ్చే వరకు వెయిట్‌ చేస్తా. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏమైంది నీకు? నేనేం చెబుతున్నానో ఎందుకు అర్థం చేసుకోలేవ"ని అమితాబ్‌ అన్నారు. ఆమె లోపలికి వెళ్ళారు. తరవాత రోటీలు వచ్చాయి కాని.. ఆమె మాత్రం రాలేదు. వచ్చిన రోటీలు అమితాబ్‌ తింటున్నారే కాని.. మాకు తినాలనిపించడం లేదు. ప్లేట్‌లో ఏదుందో అది తినే పనిలో పడ్డాం. మరో పది లేదా పదిహేను నిమిషాలు ఉన్నా... ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

అంతా నిశ్శబ్దం. అక్కడి జరుగుతుందో మాకే అర్థం కావడం లేదు.  నిగ్రహం కోల్పోయారు.  భార్యపై అరిచారు. ఒకవిధంగా ఆయన తనకు తాను దిగజారారు.  ఇందులో దాచాల్సిందేమీ లేదు. ఒకసారి నాకు కూడా నాపై అనుమానం వచ్చింది. వారి వ్యక్తిగత జీవితంలోకి నేను అనసరంగా జోక్యం చేసుకున్నానా అనిపించింది. నాలో కొంత కన్‌ఫ్యూజన్‌. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్ళగానే అమర్‌ సింగ్‌ నుంచి ఫోన్‌. అమితాబ్‌ ఆయనతో ఎపుడూ టచ్‌లో ఉంటారు. ఏం జరిగిందో చెప్పి ఉంటారు. ఈ ఇంటర్వ్యూ అరేంజ్‌ చేసింది ఆయనే. ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయనకు అవమానం జరిగినట్లు ఫీలయ్యారు.

తరవాత ఫోన్‌ వచ్చింది శోభనా భారతీ నుంచి. ఆమె హిందుస్థాన్‌ టైమ్స్‌ (ఐ విట్నెస్‌ వారిదే) ఓనర్‌. బహుశా జరిగింది ఆమెకు అమర్‌ సింగ్‌ వివరించి ఉంటారు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ పత్రిక కంపెనీలో డైరెక్టర్‌. తరవాత ఢిల్లీకి వెళ్ళాను. అమితాబ్‌ లవ్‌ అఫైర్‌కు సంబంధించిన ప్రశ్నలను తొలగించమన్నారు. అమితాబ్‌ అడిగితేనే... అడిగానని వాదించే ప్రయత్నం చేశా. అయితే అమితాబ్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నారు.  వ్యక్తిగత జీవితాన్ని ఇలా శోధించడం సరికాదన్నారు. నాక్కూడా నేను చేసింది పూర్తిగా కరెక్ట్‌ అని అనిపించలేదు. అందుకే ఆ లవ్‌ ఎపిసోడ్‌ ప్రశ్నలను తొలగించాను.

(ఈ విషయాలను కరణ్ థాపర్‌ రాసిన 'డెవిల్స్‌ అడ్వొకేట్‌.. ద అన్‌టోల్డ్‌ స్టోరీ' పుస్తకం లోనిది. ఈ పుస్తకం ఇపుడు మార్కెట్‌లో ఉంది.)