రివ్యూ: అమ్మమ్మగారిల్లు 

రివ్యూ: అమ్మమ్మగారిల్లు 

నటీనటులు: నాగశౌర్య, షామిలి, రావు రమేష్, సుమిత్ర తదితరులు 
సంగీతం: కళ్యాణ రమణ 
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్ 
ఎడిటింగ్: జె.పి
నిర్మాత: రాజేష్ 
కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సుందర్ సూర్య 

'ఛలో' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న హీరో నాగశౌర్య ఈసారి 'అమ్మమ్మగారిల్లు' అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ ను బట్టి సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించింది చిత్రబృందం. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా వారిని ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందాం!

కథ: తూర్పుగోదావరి జిల్లాలో సూర్యనారాయణ(చలపతిరావు) ఉమ్మడి కుటుంబంతో జీవిస్తుంటాడు. భార్య సీతామహాలక్ష్మి(సుమిత్ర), ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో సంతోషంగా ఉంటారు. కానీ ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో కొన్ని విబేధాలు చోటుచేసుకుంటాయి. దీంతో సూర్యనారాయణ మరణిస్తాడు. దీంతో ఫ్యామిలీ మొత్తం విడిపోతుంది. ఆ కుటుంబాన్ని కలపాలని సీతామహాలక్ష్మి అనుకుంటుంది. తన అమ్మమ్మ కోరికను నెరవేర్చాలని మనవడు సంతోష్(నాగశౌర్య) నిర్ణయించుకుంటాడు. మరి అనుకున్నట్లుగా కుటుంబాన్ని ఒక్కటిగా కలిపాడా..? ఈ నేపధ్యంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనేదే మిగిలిన సినిమా. 

నటీనటుల పనితీరు: 
గత చిత్రాలతో పోలిస్తే నాగశౌర్య ఈ సినిమాలో పరిణితితో నటించాడు. పాత్రకు తగ్గట్లుగా భావోద్వేగాలు పండిస్తూ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్ర హీరో మామ రావు రమేష్ క్యారెక్టర్. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు రావు రమేష్. ఇంటి పెద్ద కొడుకు పాత్రలో చక్కటి హావభావాలు కనబరిచాడు. ఈ సినిమాకు అతడి నటన హైలైట్ గా నిలిచింది. ఇక మామఅల్లుళ్ల మధ్య అల్లిన కథనం ఆడియన్స్ ను మెప్పిస్తుంది. షామిలి తెరపై అందంగానే కనిపించింది. కానీ శౌర్య సరసన ఆమె సెట్ కాలేదనిపిస్తుంది. వీరిద్దరి లవ్ స్టోరీ కూడా చెప్పుకునేంత బలంగా రాసుకోలేదు. షకలక శంకర్ తన కామెడీతో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. అమ్మమ్మ పాత్రలో సీనియర్ నటి సుమిత్ర బాగానే నటించింది. శివాజీరాజా, రవి ప్రకాష్, హేమ పోసాని తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

సంగీతం - సాంకేతిక వర్గం :
కళ్యాణ రమణ అందించిన పాటలు ఓ మోస్తరుగా ఉన్నాయి. రెండు పాటలు మాత్రం వినడానికి, చూడడానికి బాగున్నాయి. నేపధ్య సంగీతం బాగుంది. రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫీ ఏమంత ఆకట్టుకోదు. చాలా చోట్ల ఫ్రేమింగ్ కూడా సరిగ్గా లేదనిపిస్తుంది. పాటలను మాత్రం విజువల్ గా బాగా చిత్రీకరించారు. సినిమా చూడడానికి కలర్ ఫుల్ గా ఉన్నా.. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటర్ సినిమాలు చాలా చోట్ల కత్తెర వేయాల్సివుంది. కొన్ని సన్నివేశాలను మరింత సాగదీసి చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఏ విషయంలో కూడా రాజీ పడకుండా సినిమాను రూపొందించాడు. దర్శకుడు రాసుకున్న కథ పాతదే అయినా.. ఎమోషనల్ గా సినిమాఆడియన్స్ కు కనెక్ట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమా అయినప్పటికీ తన టేకింగ్ తో పర్వాలేదనిపించాడు. 
విశ్లేషణ: 
సినిమా మొదలైన కొద్దిసేపటికే సినిమా కథ ఏంటనేది ఆడియన్స్ కు అర్ధమైపోతుంది. తెరపై నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను ఆడియన్స్ లో కలిగించలేకపోయారు. కానీ పలు ఎమోషనల్ సన్నివేశాలు మెప్పిస్తాయి. 'శతమానంభవతి' సినిమా ఛాయలు కనిపిస్తుంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం, హీరో లవ్ స్టోరీలో డెప్త్ లేకపోవడం వంటి అంశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. అయినప్పటికీ దర్శకుడు తనదైన వినోదం, కుటుంబ నేపధ్యంతో మెప్పించే ప్రయత్నం చేశాడు. చివరగా ఫ్యామిలీ డ్రామా ఎక్కువైందని అనిపించినా.. ఆ పాత్రల ద్వారా డబ్బు కంటే కుటుంబం, అనుబంధాలే గొప్పవని చెప్పే తీరు ఆకట్టుకుంటుంది.