అమీర్ పేట్- ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం

అమీర్ పేట్- ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం

అమీర్ పేట్-ఎల్బీనగర్ మెట్రో రైలు నేడు అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు కలిసి జెండా ఊపి మెట్రో రైలును  ప్రారంభించారు. ప్రధాన మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమీర్‌పేట నుంచి పంజాగుట్ట, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట మీదుగా ఎల్బీనగర్ వరకు మెట్రో పరుగులు పెడుతుంది.

ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు 16 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రావడంతో నగరంలో మెట్రో ప్రయాణం మొత్తం 46 కిలోమీటర్లకు విస్తరించింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత అతి పొడవైన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పింది. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చెన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది. నేటి నుంచి చెన్నైని వెనక్కి నెట్టి హైదరాబాద్ మెట్రోరైల్ ఆ స్థానానికి చేరుకుంది. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్‌లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర గల అమీర్‌పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.