ప్రధాని మోడీ బహిరంగ సభలో అనంత్ అంబానీ

ప్రధాని మోడీ బహిరంగ సభలో అనంత్ అంబానీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు అంబానీ కుటుంబం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ హాజరయ్యారు. ఏఎన్ఐ వార్తా సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన ఫోటోలో అనంత్ అంబానీ మోడీ ర్యాలీకి వెళ్తూ కనిపిస్తున్నారు.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పొత్తు పెట్టుకున్నందువల్ల ఈ బహిరంగ సభలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే కూడా హాజరయ్యారు. 

 ఇవాళ ముంబైవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ మరోసారి ఉత్సాహంతో గర్జించారు. తన ప్రసంగంలో 'మన సంస్కృతి, మన సామర్థ్యమే మన శక్తి. వీటి ఆధారంగా మనం ప్రపంచంలో కీలక శక్తిగా మారదామనుకుంటున్నాం. ఈ ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకొనేందుకు కాదు. ఇవి భారత్ దిశను నిర్దేశించే ఎన్నికలు. ఇది ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న ఎన్నికలు కావు. సంకల్పం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఇవి ఉత్త మాటలతో కాదు గట్టి పట్టుదలల ఎన్నికలు. దేశంలో యువత 1947 వైపు కాదు, భారత్ 100వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొనే 2047 వైపు చూస్తోంది. ఏ పార్టీలు, ఏ నేతలు పాత తరం ఆలోచనా విధానంతో ఉంటారో, వాళ్లు 21వ శతాబ్దపు యువత నాడిని అర్థం చేసుకోలేరని' చెప్పారు.