జలరవాణాకు పటిష్ట వ్యవస్థ

జలరవాణాకు పటిష్ట వ్యవస్థ

గోదావరిలో లాంచీ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. లాంచీ ప్రమాదంలో మృతులకు నివాళులర్పించిన అనంతరం.. మంత్రులు, అధికారుల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రమాదాలు జరిగాక ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా లాభం లేదని.. మరింత బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో జలరవాణాకు విదేశీ తరహాలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-23కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు:
* రాష్ట్రంలోని 71 పట్టణాలు, సీఆర్‌డీఏ పరిధిలో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
* బీపీఎల్ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే నిమిత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కందిపప్పును కొనుగోలు చేసి కిలో రూ.40 ధరకు నెలకు 2 కిలోల చొప్పున అందించేందుకు నిర్ణయం.
* ఎం-పార్క్స్ పాలసీ 2018-23’కి మంత్రిమండలి ఆమోదం
* రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త పాలసీతో ప్రోత్సాహం.
* ఇ-రిక్షా, ఇ-కార్డు, ఇ-ఆటోలకు జీవిత పన్ను మినహాయింపు
* ఆంధ్రప్రదేశ్ మోటర్ వెహికల్స్ టాక్సేషన్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ 2018’కు ఆమోదం
* ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-23’కి ఆమోదముద్ర.
* తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32 మంది సర్వీసును క్రమబద్దీకరించడానికి ఆమోదం.
* జీవిత ఖైదు అనుభవిస్తున్న 49 మంది ఖైదీలను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసేందుకు ఆమోదం.
* ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ రూ. వెయ్యి కోట్ల రుణాన్ని పొందడానికి ప్రభుత్వం హామీగా వుండాలని మంత్రిమండలి నిర్ణయం. 
* జలవనరుల శాఖలో 34 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించేందుకు ఆమోదం 
* రెవెన్యూ డిపార్టుమెంట్‌లో 392 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగుల పోస్టులకు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌ పదోన్నతి కల్పించే  ప్రతిపాదనకు ఆమోదం.
* మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు రూ. 12,600 కోట్లు
* కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం  వెయ్యి ఎకరాల వాటర్ బాడి ల్యాండ్ అప్పగించేందుకు డైరెక్టర్ అఫ్ పోర్ట్స్, కాకినాడకు అనుమతి.
* అమరావతిలో 6.84  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్ట్ అప్ ఏరియాను అభివృద్ధి కోసం ఏడీపీకి ఏపీ సి ఆర్ డీ ఏ పవర్ అఫ్ అటార్నీ ఇచ్చేందుకు అనుమతి.
* రాజమండ్రిలో వేస్టు టు ఎనర్జీ ప్లాంటు ఏర్పాటు
* చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో   500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఎలైట్ హాస్పిటల్ గ్రూపునకు  15 ఎకరాల భూమి కేటాయింపు
* అనంతపురము జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో  టౌన్‌షిప్
* విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు