చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థలకు సర్కార్ గుడ్‌న్యూస్‌ ప్రత్యేక రాయితీలు

 చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థలకు సర్కార్ గుడ్‌న్యూస్‌  ప్రత్యేక రాయితీలు

కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమతో పాటు దాని అనుబంధ వ్యవస్థలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. ఇక, ఆ తదుపరి 6 నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. 

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు జులై 2020 నుంచి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని స్పష్టం చేసింది సర్కార్.. అయితే, వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీప్లెక్స్‌ థియేటర్లకు లేదని వివరంగా పేర్కొంది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధికలిగేలా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొంది ఏపీ ప్రభుత్వం. కాగా, కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు.. సినీ పరిశ్రమ, దాని అనుబంధ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే.