మార్చి 15 లోపే మండలి రద్దు...? 

మార్చి 15 లోపే మండలి రద్దు...? 

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేయాలనీ కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.  బుధవారం రోజున జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ ప్రధాని మోడీతో ఈ విషయం గురించి చర్చించారు.  అయితే, జగన్ కు మరలా ఢిల్లీ రావాలని, అమిత్ షాతో ఈ విషయం గురించి మాట్లాడాలని సూచించడంతో జగన్, గత శుక్రవారం రోజున హుటాహుటిగా ఢిల్లీ వెళ్లారు.  

అమిత్ షాతో మండలి రద్దు విషయం, మూడు రాజధానుల విషయం తీసుకొచ్చారు.  అదే విధంగా కర్నూలుకు హైకోర్టు విషయం కూడా మాట్లాడతారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో కర్నూలుకు హైకోర్టును ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, దానిని అమలు చేయాలని జగన్ కోరడంతో దీనిపైనా షా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.  

అయితే, శుక్రవారం రోజునే ఢిల్లీ నుంచి తిరిగి రావాల్సి ఉన్నా, న్యాయశాఖ మంత్రి అపాయింట్మెంట్ చివరి నిమిషంలో దొరకడంతో తిరుగు ప్రయాణం పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.  న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ను జగన్ కలిసిన తరువాత రద్దుపై స్పష్టమైన హామీ వచ్చినట్టుగా తెలుస్తోంది.  మార్చి 3 వ తేదీ నుంచి రెండోదఫా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటుగా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి రద్దు చేయడానికి కేంద్రం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.  ఈలోపుగానే మండలి రద్దు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.