కేంద్రాన్ని కడిగేయాల్సిందే...  

కేంద్రాన్ని కడిగేయాల్సిందే...  

అవిశ్వాసంపై ఎంపీలతో, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. ఈరోజు అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారని అప్పుడు మోడీ అన్నమాటలను గుర్తుచేయాలన్నారు. ఒక్కో అంశానికి కేంద్రం ముడుల మీద ముడులు వేస్తోందని... చిక్కు ముడులను పెంచుతోందని వివరించారు. అమరావతికి రూ.666కోట్లు విడుదల చేయాలని నీతి అయోగ్ 4. 6. 2018న సిఫారసు చేసిందని...నెలన్నర అయినా కానీ... ఇంతవరకు అతీ గతీ లేదని ఆయన తెలిపారు. రెవిన్యూలోటు ధ్రువీకరణలో పించన్ల మొత్తం 10నెలల ఖర్చు లెక్కలోకి తీసుకోలేదని తెలిపారు. ఒక్కనెల పించన్ల ఖర్చునే లోటు లెక్కలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని వెల్లడించారు. హోదా ప్రయోజనాలను 10 రాష్ట్రాలకు 2027వరకు కొనసాగిస్తున్నారు. ఏపీకి మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలని కోరారు.హోదా రాష్ట్రాలకు ఒక న్యాయం, ఏపీకి మరో న్యాయమా..? అంటూ ప్రశ్నించారు.  స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితేనే హోదా ప్రయోజనాలు వాటికి పొడిగించారా..? ఏపికి మాత్రమే స్పెషల్ పర్పస్ వెహికల్ అడగడం ఏమిటి..? ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. నష్టాలలో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పోరేషన్ ను ఓఎన్జీసీలో విలీనం చేశారు. ఓఎన్జీసీని మరింత నష్టాల్లోకి నెట్టారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏడాదికి రూ.1,238కోట్లు చొప్పున 15ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్నే చెల్లించమంటారా...? అంటూ మండిపడ్డారు.  

గుజరాత్ నష్టాలను గట్టెక్కించిన మీరు ఏపీని మరిన్ని నష్టాలలో ముంచడం ఏం న్యాయం..? డివల్యూషన్ పేరుతో రాష్ట్రాలకు కొంతే ఇస్తోంది. కన్సాలిడేషన్ ఫండ్ నుంచి కావాల్సిన రాష్ట్రాలకే ఇస్తున్నారు. 2018చివరికల్లా దుగరాజపట్నం మొదటిదశ పూర్తి చేయాలని ఉంది. ఇంతవరకు దాని అతీ గతీలేదు. ఇప్పుడు వాడరేవు పోర్టు గురించి మాట్లాడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు విరుచుకు పడ్డారు.