పరువు నష్టం కేసు ఉపసంహరించనున్న అనిల్ అంబానీ

పరువు నష్టం కేసు ఉపసంహరించనున్న అనిల్ అంబానీ

కాంగ్రెస్ పై దాఖలు చేసిన పరువు నష్టం కేసును అనిల్ అంబానీ ఉపసంహరించుకోనున్నారు. ఆయన కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్, పలువురు కాంగ్రెస్ నేతలపై రూ.5,000 కోట్లకు అహ్మదాబాద్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. గత ఏడాది ఆగస్ట్ లో రాఫెల్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికపై అనిల్ అంబానీ పరువు నష్టం దావా దాఖలు చేశారు. 

వార్తాపత్రిక రాఫెల్ విమానాల ఒప్పందంపై నకిలీ, అవమానకర కథనం ప్రచురించిందని అనిల్ అంబానీ కంపెనీ ఏడీఏజీ తన పిటిషన్ లో ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు సునీల్ జక్కర్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, ఊమన్ చాందీ, అశోక్ చౌహాన్, అభిషేక్ మను సింఘ్వి, సంజయ్ నిరుపమ్, శక్తి సింగ్ గోహిల్ లపై కూడా రిలయన్స్ గ్రూప్ కేసు పెట్టింది.

నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ ఛార్జి, కథనం రాసిన విశ్వదీపక్ పై కూడా అనిల్ అంబానీ కంపెనీ సివిల్ పరువు నష్టం దావా వేసింది. 'రాఫెల్ ఒప్పందానికి 10 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ ఏర్పాటు చేశారనే' పేరుతో ఒక నకిలీ, అవమానకరమైన కథనాన్ని వార్తాపత్రిక ప్రచురించిందని అంబానీ కంపెనీ తన పిటిషన్ లో ఆరోపించింది. 

ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని, ఇది ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీని చెడుగా చూపిస్తోందని కంపెనీ తన ఆరోపణలో పేర్కొంది. దీని వల్ల ప్రజలపై దుష్ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ కథనంతో కంపెనీ ప్రతిష్ఠకు నష్టం కలిగిందని, అందువల్ల కంపెనీ వార్తాపత్రికపై రూ.5000 కోట్ల పరువునష్టం కేసు వేసింది.