ఏపీలో మరో దారుణం..ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం

 ఏపీలో మరో దారుణం..ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట విగ్రహాల ధ్వంసం, అపహరణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రణరంగంగా మారినా కూడా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూల్చేశారు. పత్తికొండ శివారులో గుత్తికి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కిందపడేసి ఉండటంతో ఉదయాన్నే స్థానికులు గుర్తించారు. దీంతో అందరూ ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నాకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే వరుసగా ఇలా విగ్రహాల ధ్వంసం జరుగుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.