ఇవాళ్టి నుంచి అన్నా హజారే నిరాహా దీక్ష

ఇవాళ్టి నుంచి అన్నా హజారే నిరాహా దీక్ష

సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇవాళ ఉదయం 10 గంటలకు మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు. గతంలో ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన హజారే తన డిమాండ్ నెరవేరక పోవడంతో మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. జనవరి 30లోగా లోక్‌పాల్ విచారణకర్తను నియమించని పక్షంలో మళ్లీ ఆందోళన తప్పదని ఆయన గతంలోనే హెచ్చరించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకంపై కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని అన్నా విమర్శించారు. 

తొలుత ఈ ఏడాది మార్చి 23న అన్నా నిరాహారదీక్ష చేశారు. ఆయన డిమాండ్ నెరవేరస్తామని హామీ ఇస్తూ పీఎంవో లిఖితపూర్వకంగా తెలపడంతో దీక్ష విరమించుకున్నారు. అక్టోబర్ 2 వరకు గడువు విధిస్తున్నట్టు ప్రకటించారు. గడువు తీరినా కేంద్రం స్పందించకపోవడంతో తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఐతే లోక్‌పాల్, లోకాయుక్త నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చిందని కేంద్రం చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. ఆ తర్వాత  జనవరి 30లోగా తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే ఇవాళ దీక్షకు దిగుతున్నారు.