మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా బాట..?

మరో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా బాట..?

అసలే 16 మంది ఎమ్మెల్యేలు దూరమై బలపరీక్ష ఎదురుకోవడానికి అష్టకష్టాలు పడుతోన్న కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్.. మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఓవైపు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు బలపరీక్షపై ఓటింగ్‌ను వాయిదా వేస్తూ వస్తున్న సంకీర్ణ సర్కార్‌కు మరో 8 మంది రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ టార్గెట్‌గా పెట్టుకోగా.. ఇప్పటికే, 12 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేవారు. అనారోగ్యంతో ముంబైలో ఉన్న కాగవాడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్‌లు శాసనసభకు వచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో 16మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టే బలనిరూపణకు దూరమైనట్టే.. ఇక స్వతంత్రులు ఇరువురు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని ప్రకటించగా.. బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్‌ కూడా తటస్థంగానే ఉన్నారు. దీంతో, సంకీర్ణ సర్కార్‌కు ఉండే బలంలో 19మంది తగ్గినట్టయ్యింది. 

ప్రస్తుతం రాజీనామా చేసినవారిలో ఎక్కువమంది మైసూరు, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారు. ఇక్కడ బీజేపీకి అంతగా బలం లేకపోగా.. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే గెలవడం కష్టమవుతుందని భావిస్తోన్న బీజేపీ.. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. అది కూడా ఒకటి, రెండు సామాజిక వర్గాలవారినే టార్గెట్ చేసి రాజీనామా చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వాసపరీక్షపై ఓటింగ్ ఆలస్యమైతే.. బీజేపీ.. ఆ ఎనిమిది మందితో రాజీనామా చేయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇది, కాంగ్రెస్ నేతలకు కూడా తెలిసిపోవడంతో.. అసలే మైనార్టీలో పడిపోయి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతోన్న సమయంలో.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేజారకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు నేతలు.