మందమర్రిలో మరో పులి చర్మం లభ్యం...

మందమర్రిలో మరో పులి చర్మం లభ్యం...

ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో మళ్లీ కలకలం రేగింది. నెలరోజుల వ్యవధిలో మరో పులి చర్మాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రామన్ కాలనీ ఏరియాలోని ఐలనేని లింగయ్య అనే ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు మరో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెలరోజు క్రితం ఇచ్చోడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పులి చర్మం బయటపడిన విషయం తెలిసిందే. వరుస ఘటనలతో జిల్లా అటవీ శాఖ అధికారులు బెంబెలెత్తిపోతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంఖ్య తగ్గిపోవడానికి ఇలాంటి వేటగాళ్లే కారణం కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లంతా వరంగల్, కాగజ్‌నగర్, నిర్మల్ జిల్లాకు చెందినవాళ్లు. పులి చర్మం, గోళ్లకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనాలో వాటితో మందులు తయారుచేస్తున్నారు. అందువల్ల అక్రమార్కులు పులి చర్మం కోసం వేటగాళ్లకు డబ్బు ఎరవేస్తున్నారు. ఒక్కో పులి చర్మాన్నీ రూ.10 లక్షలకు అమ్ముతున్నట్లు తెలిసింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలా పులులను చంపి వేటగాళ్లు.. ఆ చర్మాలను చైనాకు రహస్యమార్గాల్లో తరలిస్తున్నారు. ఈ వరుస ఘటనలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.