యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న అనుష్క..?

యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న అనుష్క..?

అనుష్క శెట్టి ఈ పేరు అందరికీ సుపరిచితమే. సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్స్‌లో టాప్ అమ్మడి పేరు ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. అనుష్క సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. చిరంజీవి ప్రధాన పాత్రగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలోనూ అనుష్క అతిథి పాత్రలో కనిపించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో సినీ తారలందరూ ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తొలగిపోయాక అందరూ మంచి జోరుపైన తమ సినిమాలను ప్రకటించారు. కానీ అనుష్క మాత్రం నిశ్శబ్దం సినిమా తర్వాత ఏ సినిమాను ప్రకటించలేదు.  తాజాగా అమ్మడి తాజా సినిమాకు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాలో యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్నారంట. అది కూడా ఎవరో కాదండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ అలరించి ఇప్పుడు జాతి రత్నంగా మన ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారంట. ఈ చిత్రం 40 సంవత్సరాల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికి మధ్య సాగే ప్రేమకథగా టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే నవీన్ ప్రస్తుతం తన తాజా సినిమా జాతి రత్నాలు రిలీజ్ పరంగా బిజీగా ఉన్నారు. జాతి రత్నాలు సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.