టైటిల్‌లో ఓ అక్షరం అటూ ఇటూ అయినా డేంజర్: నిర్మాత దాము 

టైటిల్‌లో ఓ అక్షరం అటూ ఇటూ అయినా డేంజర్: నిర్మాత దాము 

జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రధారిగా న‌టించిన చిత్రం 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'. రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించగా విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శక‌త్వం వ‌హించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యారు దర్శకనిర్మాతలు. సినిమా సినిమాకీ రెండు మూడేళ్లు గ్యాప్ రావ‌డానికి కార‌ణం, స్క్రిప్ట్ విష‌యంలో తను తీసుకొనే జాగ్రత్తే కారణమని, స్క్రిప్ట్ యూనిక్‌గా, ఆసక్తికరంగా ఉంటే త‌ప్ప సినిమా చెయను అంటున్నారు నిర్మాత దాము. ఇక దర్శకుడి అనుభ‌వాన్నీ, ప‌నిమీద అంకిత‌భావాన్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటానంటూ... 
24 శాఖ‌ల్లో అవ‌గాహ‌న ఉందా, లేదా అనేది చూస్తానంటున్నారాయన. జ‌గ‌ప‌తిబాబు ద్వారా సాగ‌ర్ తనకు ప‌రిచ‌య‌మ‌య్యాడని, అతను చెప్పిన కథ... అందులో సోల్‌కు క‌నెక్టయ్యానంటున్నారు. సినిమా క‌థ న‌డిచేది నాలుగు ప్రధాన పాత్రల‌తో కాబట్టి... ఆ పాత్రలు పేర్లతో 'ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్' అని టైటిల్ పెట్టారట. అది లెంగ్తీగా అనిపించటంతో పొడి అక్షరాల్లో 'ఎఫ్ సీయూకే' అని పిలుస్తున్నామని... అందులో ఓ అక్షరం అటూ ఇటూ అయినా బూతు అవుతుంద‌ని తెలుసు. అయితే సినిమాలో ఎక్కడా బూతు ఉండ‌దని... హాయిగా న‌వ్వుకొనేట్లు ఉంటుందంటున్నారు. 
ఇక సినిమాకు 'ఎ' స‌ర్టిఫికెట్ రావటంపై స్పందిస్తూ... శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ ఎప్పుడూ త‌ల‌దించుకొనే సినిమాలు తియ్యదు. దీనికి సెన్సార్ 
వారు సింగిల్ క‌ట్, బీప్ లేకుండా 'ఎ' స‌ర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. వాటిని క‌ట్ చేసి యు/ఎ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు. అలా చేస్తే ఆ సీన్‌లో ఎమోష‌న్ పోతుంది. అందుకే క‌ట్ లేకుండా 'ఎ' స‌ర్టిఫికెట్ తీసేసుకున్నాం.సినిమాలో హైలైట్ కామెడీ... ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ కామిక్ రిలీఫ్. ఫాద‌ర్ క్యారెక్టర్‌కు, అందులోని చిలిపిత‌నానికీ జ‌గ‌ప‌తిబాబు సరైన న్యాయం 
చేస్తార‌నిపించి అప్రోచ్ అయ్యాం. విన‌గానే క్యారెక్టర్‌కు క‌నెక్టయి ఓకే చెప్పారు. శోభ‌న్‌బాబు గారి త‌ర్వాత అంత‌టి లేడీస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో జ‌గ‌ప‌తిబాబే. 'లెజెండ్'నుంచి ఆయ‌న విల‌న్ రోల్స్ పోషిస్తూ వ‌స్తున్నా, ఇప్పటికీ ఆయ‌న లేడీస్ ఫాలోయింగ్‌లో మార్పు లేదు. న‌ల‌భైల్లో, యాభైల్లో ఉన్న ఆడ‌వాళ్లలోనే కాదు, టీనేజ్‌లో, ఇర‌వైల‌లో ఉన్న అమ్మాయిల్లోనూ ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉండ‌టం ఆశ్చర్యం క‌లిగించే విష‌యం. మా సినిమా తర్వాత ఆయ‌న‌కు ఈ త‌ర‌హా జోవియ‌ల్ క్యారెక్ట‌ర్లు మ‌రిన్ని వ‌స్తాయ‌నుకుంటున్నాను అంటున్నారు దర్శకనిర్మాతలు దామోదర ప్రసాద్, విద్యాసాగర్ రాజు.