చంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి

చంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి

ఈవీఎంలపై ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న గొడవ అనుమానాలకు తావిస్తుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా ఈవీఎంలు ఆలస్యంగా చేరలేదని అన్నారు. అధికారులను మభ్యపెట్టి దొంగే.. దొంగే అని అరిచినట్లు చంద్రబాబు తీరు ఉందని వ్యాఖ్యానించారు. అధికారులు, చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఈవీఎంలను మ్యానేజ్ చేయడం ఆయనకు తెలుసు అన్నట్టుగా ఉందని అన్నారు. ఎన్నికలు జరిగిన తీరు పై కేంద్ర ఎన్నికల కమీషన్ పరిశీలన చేయాలని కోరతామని తెలిపారు. రోజుకో మాట మార్చే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఇన్నాళ్ళు సీఎంగా ఉండడం భాదాకరమని అన్నారు.

'నిర్దారణ చేయాలని కమిషన్ అడిగితే చంద్రబాబు ఎందుకు వెళ్ళలేదు. రాష్ట్రంలో యదేచ్ఛగా మద్యం పంపకాలు జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. యూపీలో మోడీని కించపరుస్తూ చంద్రబాబు అబద్దాలు మాట్లాడారు.  రాయచూర్ లో ఏపికి సోనియా గాంధి న్యాయం చేసిందని చంద్రబాబు మాట్లాడినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు రివ్యూలు చేయడం ముమ్మాటికి తప్పే. ఆపధర్మ ముఖ్యమంత్రి రివ్యూలు చేయడం విడ్డూరంగా  ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంది. ఇలాంటి ఎన్నికలు ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదు. యాభై కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోరా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పరువు, ప్రతిష్ఠను దిగజార్చారు' అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.