నేడు ఏపీ తొలి బడ్జెట్‌.. ప్రాధాన్యం ఏ రంగాలకు..?

నేడు ఏపీ తొలి బడ్జెట్‌.. ప్రాధాన్యం ఏ రంగాలకు..?

వైసీపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో, మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేట్టబోతున్నారు. సోదరుడి హఠాన్మరణంతో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారు.

అంతకముందు ఇవాళ ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ అయి..బడ్జెట్‌ను ఆమోదించనుంది. రూ. 2.27 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండే అవకాశం ఉందని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే వెయ్యి కోట్లు అదనంగా ఉంటుందని సమాచారం. వ్యవసాయ బడ్జెట్ రూ.28 వేల కోట్లతో తయారుచేసినట్లు తెలిసింది. మేనిఫెస్టోలో 'నవరత్నాల' పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రధాన కేటాయింపులు ఉంటాయని సమాచారం. అమ్మఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారని తెలిసింది.

ఇక.. ఈ నెల 15 నుంచి 3 రోజులపాటు బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 17న ఆర్థిక మంత్రి సమాధానం.. 18 నుంచి బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది.  29న ద్రవ్య వినిమయ బిల్లు, 30న ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలపై చర్చ ముగిశాక సభ నిరవధికంగా వాయిదా పడనుంది.