ఏపీలో సినీపరిశ్రమకు భారీ ఊరట... 

ఏపీలో సినీపరిశ్రమకు భారీ ఊరట... 

కరోనా వైరస్ కారణంగా గత ఎనిమిది నెలలుగా సినీ పరిశ్రమ మూతపడిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లు మూతపడ్డాయి.  థియేటర్లు మూతపడటంతో దానిపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు రోడ్డున పడ్డారు.  ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  సినీపరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.  పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నది.  3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టిప్లెక్స్ లు సహా, అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ప్రభుత్వంపై నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున భారం పడనుంది.  మిగిలిన ఆరు నెలల ఫిక్స్డ్ చార్జీల చెల్లింపులను వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1100 థియేటర్లకు ఊరట లభించింది.  అంతేకాకుండా రీస్టార్ట్ ప్యాకేజీ కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  ఏ, బి సెంటర్లలో థియేటర్లకు రూ.10 లక్షల రూపాయల చొప్పున, సి సెంటర్ లోని థియేటర్లకు రూ.5 లక్షల రూపాయల చొప్పున రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.  వాయిదాల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, తరువాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.4.18 కోట్ల రూపాయల భారం పడుతుంది.