గత ప్రభుత్వ అవకతవకలపై సిబిఐ విచారణ... ఏపీ కేబినెట్ ఆమోదం..!

గత ప్రభుత్వ అవకతవకలపై సిబిఐ విచారణ... ఏపీ కేబినెట్ ఆమోదం..!

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటి ముగిసింది. ఈ సమావేశంలో కీలక చర్చలతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు . గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని  కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది.. అర్హత లేని సంస్ధలకు కట్టబెట్టారని నివేదికలో పేర్కొన్న మంత్రి వర్గ ఉప సంఘం. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా  రవిప్రసాద్ ను ఫైబర్ నెట్ హెడ్ గా నియమించినట్టు నిర్దారణకు వచ్చింది. అర్హత కలిగిన కంపెనీలను పక్కకు నెట్టి ... వేమూరి హరి ప్రసాదుకు చెందిన కంపెనీకి ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.. 

సెటాప్ బాక్సుల కొనుగోళ్లల్లో భారీ కుంభకోణం జరిగినట్టు  కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది.. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ. 700 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని అభిప్రాయపడింది. ఇక, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా వంటి స్కీముల ద్వారా సుమారు రూ. 158 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చింది. మరోవైపు హెరిటెజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ద్వారా ఏడాదికి రూ. 40 కోట్ల మేర ఖర్చు పెట్టారని మంత్రి వర్గ ఉప సంఘం గుర్తించింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా.. ఖర్చు పైనా సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్, చంద్రన్న కానుక, రంజాన్ తోఫా వంటి వాటిపై సిబిఐ విచారణకు కోరాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.