ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు.  ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు.