నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ..

నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ..

ఓవైపు చివరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం, ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది... అమరావతిలో మధ్యాహ్న 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్.. పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకూ జరిగే పెన్షన్ల పండుగ, గృహ ప్రవేశాలు, డ్వాక్రా చెక్కుల  పంపిణీపై చర్చించనుంది మంత్రివర్గం. రైతులకు పెట్టుబడి సాయం అందించే అంశంపై మంతనాలు జరగనుండగా.. ఎకరాకు రూ. 2500 చొప్పున పెట్టుబడి సాయం అందివ్వాలని సర్కార్ యోచిస్తోంది. ఎన్నికల్లోగానే పెట్టుబడి సాయం అందించే అంశంపై కేబినెట్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి రూ.10 వేలు అందించే ఆలోచన చేస్తున్నారు. కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించేలా కెబినెట్ కసరత్తు చేయనుంది. పెట్టుబడి సాయం పథకానికి పెట్టే పేరుపైనా చర్చించనున్నారు. దీని కోసం రైతు రక్ష, అన్నదాత సుఖీభవ పేర్ల పరిశీలనలో ఉన్నాయి. 

మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం చెల్లింపుపై చర్చించనున్నారు కేబినెట్ మంత్రులు.. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చసాగనుండగా... ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు ప్రభుత్వం చేపట్టే నిరసన కార్యక్రమాలపై కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడగా... దానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.