ఏపీ కేబినెట్ భేటీ...శాసనమండలి రద్దుపై నిర్ణయం ?

ఏపీ కేబినెట్ భేటీ...శాసనమండలి రద్దుపై నిర్ణయం ?

ఏపీ శాసన మండలి రద్దుకు ప్రభుత్వం రంగం సిధ్దం చేస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ వేగవంతం చేసింది. సోమవారం అత్యవసర క్యాబినెట్ భేటీ వెంటనే అసెంబ్లీ సమావేశం నిర్వహించి మండలి భవితవ్యాన్ని నిర్ణయించనుంది. శాసనసభలో సుదీర్ఘ చర్చ నిర్వహించి చివర్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శాసనమండలిలో తగిలిన ఎదురుదెబ్బ అధికారపక్షం తీవ్రంగా పరిగణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో భారీ మ్యాండేట్ సాధించినా.. ప్రతిపక్షం మెజారిటీ ఉన్న మండలిలో ఎదురవుతున్న పరిణామాలపై వైసీపీ సీరియస్ గా ఉంది. మూడు రాజధానులు, సిఆర్డీఏ బిల్లులే కాకుండా ఇంతకు ముందు ఎస్సీ,ఎస్టీ బిల్లు, ఇంగ్లీష్ మీడియం బిల్లులకు కూడా మండలి అడ్డుతగిలింది. అప్పుడే మండలి రద్దు చేయాలన్న అంశం చర్చకు వచ్చినా తొందరపాటు అవుతుందన్న భావనతో విరమించుకున్నారు. అయితే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల విషయంలో  రెండు రోజులుగా మండలిలో జరిగిన వ్యవహారం అధికారపక్షానికి రాజకీయంగా ఎదురుదెబ్బ తగలింది. 

మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మెన్ నిర్ణయం తీసుకోవడంతో అధికారపక్షం షాక్ కు గురయ్యింది. మండలి పరిణామాలపై సిఎం జగన్ తో పాటు సీనియర్ మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ తో పలువురు మంత్రులు, సీనియర్లు వరుస భేటీలు నిర్వహించారు. చివరికి మండలి రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చి శాసనసభ వేదికగా మండలిలో జరిగిన పరిణామాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సైతం రాజకీయ ప్రయెజనాలకోసం పనిచేస్తున్న పెద్దల సభ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటితో మండలి రద్దుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలిచ్చారు. అ మేరకు అవసరమైన పరిపాలన ప్రక్రియ ప్రారంభించారు. క్యాబినెట్ భేటీ నిర్వహించి అందులో మంత్రి వర్గం మండలి రద్దుకు తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకుంటారు. వెంటనే కేంద్రానికి పంపి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చర్చకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది.