రాజధానిపై జగన్ పునరాలోచనలో పడ్డారా ?

రాజధానిపై జగన్ పునరాలోచనలో పడ్డారా ?

రాజధానిపై కీలకనిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించింది. శుక్రవారం సీఎంతో సమావేశమైన కమిటీ మూడు రాజధానుల ఏర్పాటు , రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై చర్చించింది. తాము అధ్యయనం చేసిన అంశాలను సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. కీలకమైన అంశాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను సూచించింది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై కసరత్తు చేసింది. రాజధాని తరలింపు విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.

ఈ నెల 20న ప్రత్యేక సమావేశాలు మొదలై మూడురోజలపాటు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశానికి ముందుగా కేబినెట్ భేటీ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే కేబినెట్ మీటింగ్‌ను ఇవాళ్టికి ప్రీపోన్ చేస్తూ నోట్ వెలువడింది. సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపేందుకే ఏపీ కేబినెట్ అనుకున్న సమయం కన్నా ముందుగా సమావేశమవుతోందనే ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్  యథాతథంగానే కేబినెట్ మీటింగ్ ఈనెల 20నే జరుగుతుందని నిన్న రాత్రి ప్రభుత్వం నుంచి మరో నోట్ విడుదలైంది. అయితే ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్టు అనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

న్యాయ, సాంకేతిక పరమైన అడ్డంకులు రాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ పై ఫోకస్ పెడుతోందని అంటున్నారు. అందుకే క్యాబినెట్ లో చర్చించే అంశాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. క్యాబినెట్ ప్రీపోన్, పోస్ట్ పోన్ పై మంత్రుల్లో కూడా సందిగ్దం నెలకొంది. ప్రస్తుతం సిఆర్డిఏ రద్దు ఉంటుందా ? లేక కేవలం ఉపసంహరణకు పరిమితం చేయాలా అన్న చర్చ..కొందరు సన్నిహిత సీనియర్ మంత్రులతో మాత్రమే సీఎం జగన్ చర్చిస్తున్నట్టు చెబుతున్నారు.