ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం

ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉ. 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్‌ తెలిసిపోతుందని, రేపు అర్థరాత్రికి మొత‍్తం ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్‌ తర్వాత రీ పోలింగ్‌ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశామని, అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అలాగే అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీ ప్యాట్లు లెక్కిస్తామన్నారు. ఫలితాలను సరిచూసుకోవడానికి వీవీ ప్యాట్ల స్లిప్పులు ఉపయోగించనున్నట్లు ద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, 100 మీటర్ల దూరం నుంచి వాహనాలకు అనుమతి లేదని, సుమారు 25వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సువిధ యాప్,ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని ద్వివేది తెలిపారు.