సర్వత్రా ఉత్కంఠ..! పంచాయతీ ఎన్నికలపై నేడే విచారణ
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి... ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతుండగా.. మరోవైపు.. ఏపీ పంచాయతీ ఎన్నికల పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం... ఈ పిటిషన్‌ను విచారించనుంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది. దీంతో అందరి కళ్లు సుప్రీంకోర్టుపైనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇది మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు రావొచ్చునని భావిస్తున్నారు. మొదట.. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపాల్సి ఉండగా.. దీనిని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు మార్చారు. ఈ బెంచ్ ముందు ఉన్న కేసుల జాబితాలో 39వ నంబరు ఇచ్చారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఇదే ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి కేసుల వరుసలో 40వ నంబరు ఇచ్చారు. ఈ రెండు పిటిషన్లను కలిపే విచారణ జరపునుంది ధర్మాసనం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)