రాజధాని లేకపోవడం ఏపీకి అతిపెద్ద సంక్షోభం...

రాజధాని లేకపోవడం ఏపీకి అతిపెద్ద సంక్షోభం...
రాజధాని లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద సంక్షోభంలాంటిదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రాజధానికి కావాల్సినంత భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్ లాంటిదన్నారు సీఎం చంద్రబాబు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం... ఫస్ట్ హెచ్‌టీ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సైబరాబాద్ లాంటి ఆధునిక నగరాన్ని నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణానికి పూనుకున్నామన్న చంద్రబాబు... భూమిని సమకూర్చుకోవడానికి అవసరమైన డబ్బు కూడా లేదన్నారు. కానీ తనపై నమ్మకం ఉంచి రాజధాని ప్రాంత రైతులు స్పందించారన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మౌళికవసతుల నిర్మాణాన్ని చేపట్టామని... విశాలమైన రహదారులు, భూగర్భ జల వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ, తదితర ఏర్పాట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నామని సింగపూర్‌లో వివరించారు. కొత్త రాజధాని కోసం ఓ చక్కటి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు. అంతకు ముందు ఒక్కరోజు పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న ఏపీ సీఎం... సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్. ఈశ్వరన్‌తో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌ తర్వాత వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వాళ్లకు వివరించి చెబుతారు. తన పర్యటనలో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్‌ను కూడా కలవనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. రాత్రి తిరుగు ప్రయాణం కానున్న సీఎం బృందం... రేపు ఉదయం విశాఖకు చేరుకుంటుంది.