నిన్న కర్ణాటక.. నేడు తమిళనాడు..

నిన్న కర్ణాటక.. నేడు తమిళనాడు..

సోమవారం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడులో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారు. ఏపీ సీఎం వెంట... టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కూడా చెన్నైకి వెళ్లనున్నారు. చెన్నై చేరుకోనున్న సీఎం  చంద్రబాబు... చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి డీఎంకే కార్యాలయం వరకు జరగనున్న రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం డీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు చంద్రబాబు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంల మొరాయింపు, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసిన ఆయన.. అనంతరం విపక్ష నేతలతో సమావేశమై 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించడానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా కూడా మరోసారి ఈవీఎంల లోపాలపై గళమెత్తనున్నారు చంద్రబాబు.