నేషనల్‌ ఫ్రంట్‌ ఉండదు.. చంద్రబాబు

నేషనల్‌ ఫ్రంట్‌ ఉండదు.. చంద్రబాబు

సాధారణ ఎన్నికల ముందు నేషనల్‌ ఫ్రంట్‌ వంటి కూటమి ఏర్పాటు కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రస్థాయిల్లో వివిధ పక్షాల మధ్య సయోధ్య, ఎన్నికల పొత్తులు ఉంటాయని ఆయన చెప్పారు. కేంద్రంలో ఈసారి బీజేపీ లేదా కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలోకి రాలేదని ఆయన ద ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేరళ, తమిళనాడు, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు గడ్డు కాలం తప్పదని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో మునుపెన్నడూ  లేని  ఆత్మవిశ్వాసం ఇపుడు కన్పిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఉండదని, అద్భుత పాలన.. అభవృద్ధి సాధించానని, విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చానని చంద్రబాబు అన్నారు.
ఏపీ అభివృద్ధి చెందడం ప్రధాని మోడీకి ఎంత మాత్రం ఇష్టం లేదని చంద్రబాబు అన్నారు. అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతోందని, పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని.. అది మోడీకి ఇష్టం లేదన్నారు. గాలి జనార్ధనరెడ్డి, వైఎస్‌ జగన్‌ వంటి అవినీతి నేలతో మోడీ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ కట్టుకథలని ఆయన కొట్టి పారేశారు. తాము ఎంతో ఓపికతో ఎన్డీఏలో కొనసాగామని... కాని కేంద్రం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని చంద్రబాబు అన్నారు.