అక్కడ అడుగు పెట్టాలంటే చంద్రబాబుకి భయం

అక్కడ అడుగు పెట్టాలంటే చంద్రబాబుకి భయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్ యు)లో కాలు పెట్టడానికి ససేమిరా అంటున్నారు. ఈ నెల 29న ఏఎన్ యు ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించాల్సిన జ్ఞానభేరి ముఖాముఖి వేదికను మార్పించేశారు. మంగళగిరి సమీపంలోని ఏఎన్ యు ప్రాంగణానికి బదులు జ్ఞానభేరిని యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లోకి మార్పించారు. ఇప్పుడు అధికార వర్గాలు ఆ ప్రాంతంలో ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నాయి. 

గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ఏఎన్ యులో ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారి కూడా కాలు పెట్టలేదు. ఆయనకు ఏఎన్ యు వాస్తు కలిసిరాదని ఆయన వ్యక్తిగత వాస్తు నిపుణులు చెప్పినట్టు సమాచారం. అందుకని ఆయన నాలుగేళ్లుగా ఏఎన్ యులో ఏ కీలక కార్యక్రమం ఏర్పాటు చేసినా దానిని ఇతర ప్రాంతాలకు మార్పించేశారు. గత డిసెంబర్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) శతాబ్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు కూడా సీఎం తనకు అనుకూలంగా బైబిల్ మిషన్ గ్రౌండ్స్ కి మార్పించుకున్నారు. ఐఈఏ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన ఏఎన్ యులో కాకుండా కార్యక్రమం యూనివర్సిటీ ఆవరణ బయట జరగడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కోసం మానవ వనరుల శాఖ ఈ జ్ఞానభేరి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం జిల్లాకు రూ.10 కోట్లు కేటాయించింది. ఆగస్ట్ 4న సీఎం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్ట్ 23న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరయ్యారు. అయితే గుంటూరులో మాత్రం ముందు అనుకున్నట్టు ఏఎన్ యు క్యాంపస్ కాకుండా దానికి ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్ కి వేదిక మార్పు వెనుక బాబుగారి సెంటిమెంట్ ఉన్నట్టు తెలిసింది.