ఏరాసుకు చంద్రబాబు ఫోన్..

ఏరాసుకు చంద్రబాబు ఫోన్..

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. పాణ్యం అసెంబ్లీ స్థానం టికెట్ గౌరు చరితకు ఇవ్వాల్సి రావడంతో ఎమ్మెల్సీ ఇస్తామని.. ఏరాసుకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రతిపాదనకు ఏరాసు అంగీకారం తెలిపినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఏరాసుకు సూచించారు టీడీపీ అధినేత. కాగా, కర్నూలు జిల్లా పాణ్యం టిక్కెట్ తనకే దక్కుతుందని ఎదురుచూశారు మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి. చంద్రబాబు తనకు అన్యాయం చేయరన్న నమ్మకంతో పార్టీలోనే కొనసాగారాయన. తాను టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండిస్తూ వచ్చారు. అయితే, అనూహ్యంగా వైసీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు సుచరిత టీడీపీలో చేరారు. వైసీపీలో మళ్లీ తనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదన్న సమాచారంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. దీంతో పాణ్యం టికెట్‌ను చంద్రబాబు ఆమెకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.