నేడు కడపలో చంద్రబాబు రోడ్‌షో

నేడు కడపలో చంద్రబాబు రోడ్‌షో

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార సభలతో బిజీగా గడుపుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా రోడ్‌షో, ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కడపలో సీఎం రోడ్‌షో నిర్వహిస్తున్నారు. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీర్‌బాబు తరపున సీఎం ప్రచారంలో పాల్గొననున్నారు. కడపలో ఎక్కువగా ముస్లింలు ఉన్న గోకుల్‌సెంటర్‌ నుంచి అల్మాస్‌పేట వరకు సీఎం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం అల్మాస్‌పేటలోని బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కడప నుంచి అమీర్‌బాబును అత్యధిక మెజారితో గెలిపించాలని ప్రజలను కోరనున్నారు.

ఈ బహిరంగ సభలో జమ్ముకాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా పాల్గొంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫరూక్‌ అబ్దుల్లా పర్యటిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో పాటు ఫరూక్‌ అబ్దుల్లా రోడ్‌షోలో పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంతకుముందు 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప, కమలాపురం నియోజకవర్గాల్లో దివంగత ఎన్టీఆర్‌తో కలిసి ఫరూక్‌ అబ్దుల్లా ప్రచారంలో పాల్గొన్నారు.