'డేటాను దొంగిలించే నీచానికి ఒడిగట్టారు..!'

'డేటాను దొంగిలించే నీచానికి ఒడిగట్టారు..!'

మనం సాంకేతికతను ప్రోత్సహిస్తుంటే.. ప్రతిపక్షం సైబర్ క్రైమ్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫస్ట్రేషన్‌తో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వైసీపీ దిగజారిందని మండిపడ్డారు. 20 ఏళ్ల నుంచి పార్టీ సమాచారం కంప్యూటరీకరించాం.. దానిని తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి ఒడిగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంతో చివాట్లు తినటం వాళ్లు ఒడిగట్టిన నీచానికి చెంపచెట్టన్న చంద్రబాబు.. ఓటమి భయంతోనే రాష్ట్రంలో మన ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని.. గెలవలేమనే ఈ కుట్రలకు దిగజారారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించిన ఏపీ సీఎం.. ఈ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించిన చంద్రబాబు.. సైబర్ క్రైమ్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని.. బోగస్ ఓట్ల పేరుతో తొలగింపునకు పాల్పడిన వారందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.