విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి

విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి

కమ్యూనిస్టు నేత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న చంద్రబాబు.. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ నినాదంతో సుందరయ్య తెలుగు జాతి ఐక్యతకు ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. 1978-1983 మధ్య కాలంలో అసెంబ్లీలో సుందరయ్య ప్రసంగాలను తాను విన్నానని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల రంగంలో సుందరయ్యకు ఎంతో పరిజ్ఞానం ఉండేదన్నారు. ఆయన ఏ అంశం మీద అయినా  తగిన పరిజ్ఞానంతో, సాధికారతతో మాట్లాడేవారన్న చంద్రబాబు.. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి సుందరయ్య గారు.. ఆయన పీడిత ప్రజలకోసం కడదాకా పోరాడారు.. సుందరయ్య తుది శ్వాస దాకా నిజాయతీగా జీవించారని వెల్లడించారు. 

కాగా, 1913 మే1న జన్మించిన సుందరయ్య... 1985 మే 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఆయన.. అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకుని ఆదర్శంగా నిలిచారు. నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు సుందరయ్య. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఇతనికు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ల వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేశారు. ఆ తర్వాత తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసుల్లో చదివారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్ళికాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారయన. తండ్రినుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని కూడా నిరుపేద ప్రజలకు పంచివేశాడు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లారు. తదనంతర కాలంలో పార్లమెంట్‌లో సైకిల్ స్టాండ్‌ మాయమైపోయింది. మరోవైపు అక్టోబరు-నవంబరు 1964లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్‌లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులనబడేవారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో కొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన జీవితంలో ఎన్నోసార్లు అరెస్టులు, జైలు జీవితాన్ని గడిపారు. మే 1966 వరకు నిర్బంధంలో ఉన్నాడు. 1975-1977 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించినపుడు అరెస్టును తప్పించుకోవడానికోసం అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1976 వరకు సుందరయ్య సీపీఎం సాధారణ కార్యదర్శిగా అవిచ్ఛిన్నంగా కొనసాగాడు. ఇక హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి. గచ్చిబౌలిలోనూ గ్రంథాయం, ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ ఏటా సీపీఎం శ్రేణులు సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.