మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం

మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం

ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 

'ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'.

'మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా'.

'ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాను. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నాను' అని తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు.